నీటిబింబం


ఎప్పటినుంచో తరుముకొస్తున్న
నీడల పరదాలు తొలగించుకొని
చీకటి దారులకు వెలుతురు

చూపాలనుకుంటే
నా ఎదురుగా నీటి పలకపై
నిల్చున్న ప్రతిబింబం
నీలంబోమ్మై చూస్తోంది
పిల్లగాలికి అలల వలయాల్లో చిక్కుకుని
ప్రతిబింబం చెదిరిపోతుందని

తొందర తొందరగా నా లోపలికి
ప్రయాణం మొదలుపెట్టాను
తేటనీటి చెరువులా అంతరంగం !


ఆలోచనల చేప పిల్లలు లేవు
మనసు తొలిచే

వింత జంతువులు లేవు

వృక్షాలై పెరిగిన అసూయలు లేవు

పేరు, రూపం లేని ఉత్తబొమ్మలా

తేలియాడుతున్నాను

మాయమైన రూపం కోసం వెదుకుతూ

ఇంకా ఇక్కడే నిలబడ్డాను

పాదాల కింద జారుతున్న ఇసుక

కరుగుతున్న మన్ను వేళ్ళ మధ్య నుంచి

పారుతున్న నీటిధారలు

తలొంచుకుని చూస్తున్నాను నీటిలోకి

చెరువులో కొత్తబొమ్మనై ప్రతిబింబాన్నై

భయంగా దాగిపోయాను

కదిలి కరిగిపోతే

అంటిపెట్టుకున్న కలుష్యాలు

వెంట వచ్చిన నీడజాడలతో

అంతరంగమే మాసిపోయి

ఖాళీగా మిగిలిపోతానని భయం


అందుకే పిల్లగాలి వీచకూడదని

అలలు వలయాలై చుట్టుకోకూడదని

స్థిరంగా నిల్చున్నాను నీటిబొమ్మనై

-కళానిధి

No comments:

Post a Comment